Wednesday, October 12, 2016

అంతరాయం

అంతరాయం (సునీత గంగవరపు)
......................
మన ఎన్నో రాత్రులు కలిసి పంచుకున్నాం
చందమామ వెన్నెలలూ
నక్షత్రాల సోయగాలు
ఒకరి కళ్లలోంచి మరొకరం దోచుకుంటూ..
కదులుతున్న చేతివేళ్ల కొనలతో
స్పర్శానుభూతిని చిత్రీకరిస్తూ..

నిశ్శబ్ద ఊసులనే ఊపిరిగా శ్వాశిస్తూ మనం..
ఎన్నో రాత్రులు కలసి ఆస్వాదించాం
ఇంతలో...ఏమయిందో తెలియదు
అనుమానమో..అసంతృప్తో...ఆత్మన్యూనతో - ఏమిటో అర్దం కాదు

ఆకాశం రెండుగా విడిపోయిన భావన...ఆశలను అనుభూతులను
అమాంతం మింగేసిన అలజడి
కట్ చేస్తే....

జీవితానికి అటువైపు
నిప్పులు చెరుగుతూ నీవు..
ఇక్కడ నిశ్చెష్టనై చూస్తూ నేను!
మనం ఏకమవ్వాల్సిన దారిని
ఎవరో చెరిపేసిన గుర్తులు
బహుశా..ఈ జన్మకిక ఇంతేనేమో..

సునీత.జి -


------------------------------------------------------
సునీత గారు వ్రాసిన కవిత చదివి ఇది రాయకుండా ఉండలేక పోయాను:


ఇంతే కాదు
ఇది అంతం కాదు
చెంతకీ చింతకీ మధ్య
చిన్న
అంతరాయం మాత్రమే

గెలిచి చూడు
ఈ పాడు అహాలను
వలిచి చూడు
అనుమాన పొరలను
పిలిచి చూడు
నీలో సగాన్నే- నా
మనసు చూడు
దిగంబరంగా

వెల కట్టకు
మన వలపు తలపులకు
లెక్కెట్టకు
మన తప్పొప్పులను
వలపించిన
ఆ మధుర స్మృతులకే
విలపించకు
విషాదమంటూ

కష్టం సౌఖ్యం
అన్నీ చూసి
కలిసున్నాంగా
గతకాలంలో
గో- ఇగో ల
గొడవల గోలల్లో
మరిచావా
మన సంగమ శృతులు

బరువెక్కిన హృదయం మునిగే
విభేదాల తిమిరంలోన
పిలవలేని పలకై నిలిచాం
శిలలయ్యిన శరీరాలతో

ముందున్నది ఎంతో కాలం
చెల్లించకు ఇంకా మూల్యం
ఒక్కసారి కలిసి నడిస్తే
మనసులకే మరో ముడేస్తే
చెల్లును ఈ విషాద యోగం
శాశ్వతమీ వివాహ బంధం


No comments:

Post a Comment