Wednesday, November 9, 2016

ప్రాణజ్యోతి

ఎంతో పాడాలి పాడాలి అనుకుంటూనే-
ఇంకా పాట ప్రారంభించలేదు నేను
వాద్యాన్ని శృతి చేయటంతోనే
చాలా సమయం గడిచిపోయింది
హృదయాంతరాల్లోని ఉద్వేగం
చేతి మునివేళ్ళ చివరి వణుకై
తంత్రుల మీద తచ్చాడుతోంది-
నీ ముందు నా పాట...!

కోయిల కూసినా పూవులు కదిలినా
మందస్మితం చేసే నువ్వు
కాకుల రాగాలకీ ఖరముల గానాలకీ కూడా
తన్మయత్వంతో తలాడిస్తావని తెలుసు
కరుణామృత సమవర్తివి కదా
అయినా సరే భయం, సంశయం.

తీరా సమయం వచ్చేసరికి
ఎంతో ప్రయత్నించాను-
నా ప్రేమంతా ప్రార్థనతో వ్యక్తం చేసి
నా హృదయపు మట్టి పాత్రను
నీ పాదాల వద్ద రిక్తం చేద్దామని.

నువ్వలాగే నన్ను చూస్తూ నింపాదిగా కూర్చున్నావు.

శతకోటి సూర్యప్రభలతో
ప్రపంచాన్ని శాసించే నా స్వామి
నా పాట కోసం నా ముందు
ఇంత నిరాడంబరంగా కూర్చుంటే-
ఏ రాగంలో నైవేద్యమవ్వాలో తెలీని భావంతో
ఏ హారతిగా ఆవిరవ్వాలో తెలీని ప్రాణంతో
తడిసిన కన్నుల తడబడు పెదవుల
తడారిన గొంతు దగ్గర
ఆగిపోయి అవ్యక్తమైన నా పాట-

బాధ్యత గుర్తొచ్చి
బొంగురైన గొంతు పెగల్చుకునే సమయానికి-

దివ్వున లేచి నీ సింహాసనం నుంచి వెళ్ళిపోయావు.

కళ్ళనిండా నీళ్ళు నింపుకున్నాను
గొంతు దగ్గర చిక్కుకున్న పాట
వేదనతో వెక్కిళ్ళయింది
నా రాత ఏమని చెప్పను?
నా జ్యోతిని స్తుతించే పాటి సేవ కూడా చేయలేని అభాగ్యానికి
అరచేతుల్తో ముఖం కప్పుకుని
హృదయం విరిగి విలపిస్తుంటే
నీ అమృత హస్తంతో నా భుజం తడిమి
"పాట బావుంది" అన్నావు.

ఎంతో పాడాలి పాడాలి అనుకుంటూనే
ఇంకా పాట ప్రారంభించలేదు నేను.

No comments:

Post a Comment