Tuesday, September 25, 2012

ముద్దువ్రాలు

ఒంటరి రాత్రి, రెండింటి సమయంలో ఇళయరాజా ట్యూన్ విని, భావావేశానికి లోనై, పాట అర్థం తెలీక పోయినా, ప్రక్కనున్న పెన్సిల్ తీసి instantly రాసిన లైన్స్. ఆ మహానుభావుడు బాణీ తో మంత్రముగ్ధుణ్ణి చేసి రాయించాడు అనిపించింది (ముందెప్పుడూ అలా రాయలేదు, కీరవాణిని అభిమానించినంతగా ఈయనపై గొప్ప ఆరాధనా లేదు). ఇదేదో నేను రాసిన గొప్ప కావ్యానికి ఉపోద్ఘాతంలా రాయట్లేదు. మన ప్రమేయం లేకుండా ఒక భావం చేతుల్లోంచి flow అయ్యే ఆ అనుభూతి గొప్పది. అది కావ్యం కాకపోయినా, రాసిన తర్వాత చూస్కుని "అరె- this abstraction is making sense" అనుకుని అబ్బురపడిపోయే ఆనందం గొప్పది.

*   *   *   *   *   *   *   *
పెదవి తాకిన ఈ క్షణం
ఏం ఆలోచించను?
ఇది ఈనాటిదా
ఏదో పాత జన్మల పరిచయాన్ని గుర్తుచేసేందుకే
ఈ క్షణం దాకా ఇలా పెదవుల్లో మౌనమై దాగి ఉందా?

మనసులు వణికి
పెదవులు వదులై 
మైకంతో మైనమైన వేళ,
ఇలాగే ఉంటావుగా-
క్షణాన్ని అసత్యం అవనివ్వకుండా.
జన్మకి అర్థం లేకుండా చేసి.

*   *   *   *   *   *   *   *

అంతే.
అయితే ఈ భావాన్ని అదే ట్యూన్ లో రాయాలని తర్వాత ఎంత ప్రయత్నించినా ఒక పట్టాన అవలేదు. స్వరంలోని భావానికి బాణీలో అంత "చోటు" దొరకలేదు! చాలా హాయి స్వరం. బరువైన మాటలు. ఇమడ లేదు.

ఎంతో శ్రమపడ్డాక, చివరకి ఏదో ఇలా వచ్చింది-


*   *   *   *   *   *   *   *
మొదలిది కాదా
ముందే తెలుసా 
ఏ జన్మదో
అధరాలకీ యోగం
శృతి చాలని రాగం
ఎన్నాళ్ళ జ్ఞాపకం

మోవి చాటున మౌనం
అది ఏ రాగమో
మన ముందు జన్మల బంధం
ముడుపై దాచెనో
  
మొర వింటావుగా
ముకుళింత చేయగా
అమరుంటావుగా
అమరం చేయగా

అధరాలిలా అడిగాయిలా
బదులందక అలిగాయిలా

*   *   *   *   *   *   *   *



 
సంగీత సరస్వతి "ఇసై జ్ఞాని" ఇళయరాజాకి. భక్తితో.