Sunday, December 23, 2012

ఆదివిష్ణువితడు

 
 
నిక్కము ముక్కోటి దేవతల నిజరూపమితడు
వెక్కసమగు మహిమలతోన వేంకటేశుడు

బుడుత ప్రాయమున నదిలో ఆటై
పడగపై పడిన పాదము
ఉడుత సాయముకైన ఉప్పొంగిపోయి
నెనరెడి నిమిరిన కరుణ రామకరము

వటువై బలితల భారమై నిలచి
వటపత్రము పైన వాటముగ తేలి
చిటికెన వేలితోనే కొండనెత్తి పెట్టిన వింత
అటుపై తులసికి కూడ తూగినాడంట

తులకింపు భక్తికి తూగ- తులలో
తులసీదళపు తులితమైన భక్తసులభము
కర్మకలితములైనా పాప ఫలితములైనా
తలచగా తొలిచెడి కరివరద అభయము

అంతరంగమున అంతా తానై
సంతసములనిచ్చు రూపము
చింతలన్నిటిని వింతచేసి మాపి
సంతపెట్టి పంపు ఎంత మంచి దైవము

నిక్కము ముక్కోటి దేవతల నిజరూపమితడు
వెక్కసమగు మహిమలతోన వేంకటేశుడు

-----------------------------------------------------
ముక్కోటి ఏకాదశి, 2012

Saturday, December 1, 2012

కుర్రప్రేమ

అతడు:
ఎల్లలు లేక అల్లరి ప్రేమ
నన్నే నీ నీడై మార్చి
నిన్నే నా తోడై చేర్చి
పాడే ప్రియరాగాలు
ప్రతినాడూ శుభకాలాలు

1
ఆమె:
కాలవ గట్టూ కోవెల మెట్టూ
కన్నే కొట్టి చెట్టూ పుట్టా ఏమంటున్నాయి?
చూడగ గుట్టు కోయిల జట్టు
కన్నే కుట్టి మంచీ చెడ్డా ఏం చెబుతున్నాయి?

అతడు:
చేయక బెట్టు చేసిన ఒట్టు
గుర్తేపెట్టి ఎట్టాగొట్టా రమ్మంటున్నాయి
లేదిక రట్టు కోనల చుట్టూ
చేయిపట్టి చెట్టాపట్టా పొమ్మంటున్నాయి

కోరికలే పారాడేటట్టు..

2
అతడు:
మోవిని నవ్వు మోదుగ పువ్వు
నాకై విరిసి నీపై మెరిసి ముద్దొస్తున్నాయి
దాచిన సోకూ దాగని సిగ్గూ
అంతకు మించి ఆశలు పెంచి కవ్విస్తున్నాయి

ఆమె:
తియ్యగ మురిసి లోకము మరిచే
మాటలు చెప్తావు మాయే చేస్తావు

తారకలే తారాడేటట్టు..