Sunday, December 23, 2012

ఆదివిష్ణువితడు

 
 
నిక్కము ముక్కోటి దేవతల నిజరూపమితడు
వెక్కసమగు మహిమలతోన వేంకటేశుడు

బుడుత ప్రాయమున నదిలో ఆటై
పడగపై పడిన పాదము
ఉడుత సాయముకైన ఉప్పొంగిపోయి
నెనరెడి నిమిరిన కరుణ రామకరము

వటువై బలితల భారమై నిలచి
వటపత్రము పైన వాటముగ తేలి
చిటికెన వేలితోనే కొండనెత్తి పెట్టిన వింత
అటుపై తులసికి కూడ తూగినాడంట

తులకింపు భక్తికి తూగ- తులలో
తులసీదళపు తులితమైన భక్తసులభము
కర్మకలితములైనా పాప ఫలితములైనా
తలచగా తొలిచెడి కరివరద అభయము

అంతరంగమున అంతా తానై
సంతసములనిచ్చు రూపము
చింతలన్నిటిని వింతచేసి మాపి
సంతపెట్టి పంపు ఎంత మంచి దైవము

నిక్కము ముక్కోటి దేవతల నిజరూపమితడు
వెక్కసమగు మహిమలతోన వేంకటేశుడు

-----------------------------------------------------
ముక్కోటి ఏకాదశి, 2012

Saturday, December 1, 2012

కుర్రప్రేమ

అతడు:
ఎల్లలు లేక అల్లరి ప్రేమ
నన్నే నీ నీడై మార్చి
నిన్నే నా తోడై చేర్చి
పాడే ప్రియరాగాలు
ప్రతినాడూ శుభకాలాలు

1
ఆమె:
కాలవ గట్టూ కోవెల మెట్టూ
కన్నే కొట్టి చెట్టూ పుట్టా ఏమంటున్నాయి?
చూడగ గుట్టు కోయిల జట్టు
కన్నే కుట్టి మంచీ చెడ్డా ఏం చెబుతున్నాయి?

అతడు:
చేయక బెట్టు చేసిన ఒట్టు
గుర్తేపెట్టి ఎట్టాగొట్టా రమ్మంటున్నాయి
లేదిక రట్టు కోనల చుట్టూ
చేయిపట్టి చెట్టాపట్టా పొమ్మంటున్నాయి

కోరికలే పారాడేటట్టు..

2
అతడు:
మోవిని నవ్వు మోదుగ పువ్వు
నాకై విరిసి నీపై మెరిసి ముద్దొస్తున్నాయి
దాచిన సోకూ దాగని సిగ్గూ
అంతకు మించి ఆశలు పెంచి కవ్విస్తున్నాయి

ఆమె:
తియ్యగ మురిసి లోకము మరిచే
మాటలు చెప్తావు మాయే చేస్తావు

తారకలే తారాడేటట్టు..

Thursday, November 29, 2012

ఆమె జడ

"దాని సన్నాయి జళ్ళోన సంపెంగ" అన్న వేటూరి లైన్ విని ఆశువుగా రాసిన లైన్స్ (ఇవి ఛందస్సులో ఉండవు):

నక్తము రంగు తీరు, ముక్తాయి పై బారు; ఆ
ముక్తమై ముక్తమౌనే పసిమొగ్గ కూడ; అట్టి
కీర్తియుందలచి కొలిచి, వ్యక్తము చేసి చూడ
కడు వక్తకు కూడ సూక్తము రిక్తము.

పిరుదుల్ తాకునట్టి బిరుదుల్ గల్గెనో
విరులన్ దాచిన వెన్నెల సెలయేటి కురుల్;
అరుదైనట్టి కుప్పెలు, కొప్పున అమరెను గదా
మరుడే నల్లగడ సన్నాయి జడను బట్టి.


పోతే ఆ జడ అందాన్ని కందాలుగా మార్చితే:

కందం.
నక్తము రంగై మెరిసెన్
ముక్తాయటు బారు తీసి ముదమున నొసగెన్
ముక్తి ని పొందెను పూవా
ముక్తమవగ లలన వాలు పూజడ నందున్

కందం.
వ్యక్తము చేయగ వశమే
వక్తకయిన వాలు జడను వలచుట కన్నన్
రిక్తమవును తన హృదయము
రక్తి నొసగు కురుల సిరి తలచిన సమయమున్

కందం.
పిరుదుల్ తాకెడి బిరుదుల్
పరులిచ్చిరి కుప్పె నటన పరికింపగనే
మరుడే అమరెను కొప్పున
నలుపు చెరకు గడగ జడను నయముగ మీటన్


Monday, November 19, 2012

ప్రణయగానం

మన కథే మరులుగా మెరిసెనో
అమరమై ఈ విరులుగా విరిసెనో
ప్రేమదేవతార్చనై
నీ గళం నా గళం కలసి గానము చేయగా

వెల్లువై వెన్నెల
వెలను దాచిన అలలుగా
వెనుక విన్న కలల సాక్ష్యమిచ్చెనో
ఆ నాటి ఆశ
వీడనన్న బాస
నీ పాటై నా పాటై నిలిచి ఉండునో

పాడనీ వరమని
కలసి కన్న కలలని
కలయికైన చెలిమి ఏ తొలి బంధమో
కాలాల తోటి
జన్మాలు దాటి
నీవెవరో నేనెవరో
ఏల కలిశామో

చెదరదీ బంధమే
మనవి చేసెను హృదయమే
ప్రణవమంటి ప్రణయమే నా ప్రాణమై
నా కంటి నిండా నీ రూపు నింపి
అలుపులేక ఎలమి గానం ఆలపించనీ

Thursday, October 11, 2012

స్వరంవరం


రంగురంగుల నా కలలన్నీ కలహంసలు కాగా
నా కథనే వింటే కళ్ళే తుడిచి రెక్కలు ముడిచేగా
గలగలగలమని తుళ్ళే అలలే నా వెతలే వింటే
ఆ పరుగులు ఆపి కరములు చాపి శిలలా అయిపోవా

రెక్కల ఎగిరి చుక్కలు చేరగా నేనూ ఆశపడ్డా
శూన్యము దొరికి రెక్కలు విరిగి క్రిందకు జారిపడ్డా
ఒక పాట చాలదా పల్లవించగా
గుండెచప్పుడే గానంగా

చరణం:
వరములని అడిగే ముందే
స్వరములను తానే ఇచ్చి
దైవమే నా కళ్ళను కరుణతొ కట్టేసింది

నా పాట పల్లవులన్నీ
నా కంటి చీకట్లేగా
నలుపులో ఎంత గొప్ప అందముంది

మనసులో మహలు నివాసం
నిజముకీ నీడే నేస్తం
కానలేని కన్నులకన్నీ ఒకటే

రాగమొచ్చి తానం నేర్చి
గుండెపాట నేనే కూర్చి
పాడుకునే యోగం కన్నా వరమేముంది?


Tuesday, October 9, 2012

ప్రేమ-సాధకుడు

ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు బూసెజ్జపై,
ఒకచో శాఖములారగించు నొకచో నుత్క్రుష్ట శాల్యోదనంబు
ఒకచో బొంత ధరించు నింకొక్కతరిన్ యోగ్యాంబర శ్రేణిన్
లెక్కకు రానియ్యడు కార్యసాధకుఁడు కష్టంబున్ సుఖంబున్ మదిన్.

భర్తృహరి కృతి అయిన ఈ గొప్ప సుభాషితం నేనెప్పుడూ గుర్తుచేసుకుంటూ ఉంటాను. With all due respect, ఈ క్రింది పద్యం ఆశువుగా వ్రాయటం జరిగింది:

ఒకచో పువ్వులిచ్చు నొకచో నొప్పించు నొక ముద్దుకై,
ఒకచో చతురములాడుచుండు నొకచో అత్యుష్ణ ఆలింగనంబు
ఒకచో నింద భరించు నింకొక్కతరిన్ నితంబపు* శ్రేణిన్
చిక్కులు సేయుచుండు ప్రేమికుఁడు పృష్ఠమున్, ముఖంబున్, మదిన్.


(భర్తృహరి తాతయ్యకి క్షమాపణలతో.)
----------------------------------------------------------------------
*నితంబము=పిఱుదు

Tuesday, September 25, 2012

ముద్దువ్రాలు

ఒంటరి రాత్రి, రెండింటి సమయంలో ఇళయరాజా ట్యూన్ విని, భావావేశానికి లోనై, పాట అర్థం తెలీక పోయినా, ప్రక్కనున్న పెన్సిల్ తీసి instantly రాసిన లైన్స్. ఆ మహానుభావుడు బాణీ తో మంత్రముగ్ధుణ్ణి చేసి రాయించాడు అనిపించింది (ముందెప్పుడూ అలా రాయలేదు, కీరవాణిని అభిమానించినంతగా ఈయనపై గొప్ప ఆరాధనా లేదు). ఇదేదో నేను రాసిన గొప్ప కావ్యానికి ఉపోద్ఘాతంలా రాయట్లేదు. మన ప్రమేయం లేకుండా ఒక భావం చేతుల్లోంచి flow అయ్యే ఆ అనుభూతి గొప్పది. అది కావ్యం కాకపోయినా, రాసిన తర్వాత చూస్కుని "అరె- this abstraction is making sense" అనుకుని అబ్బురపడిపోయే ఆనందం గొప్పది.

*   *   *   *   *   *   *   *
పెదవి తాకిన ఈ క్షణం
ఏం ఆలోచించను?
ఇది ఈనాటిదా
ఏదో పాత జన్మల పరిచయాన్ని గుర్తుచేసేందుకే
ఈ క్షణం దాకా ఇలా పెదవుల్లో మౌనమై దాగి ఉందా?

మనసులు వణికి
పెదవులు వదులై 
మైకంతో మైనమైన వేళ,
ఇలాగే ఉంటావుగా-
క్షణాన్ని అసత్యం అవనివ్వకుండా.
జన్మకి అర్థం లేకుండా చేసి.

*   *   *   *   *   *   *   *

అంతే.
అయితే ఈ భావాన్ని అదే ట్యూన్ లో రాయాలని తర్వాత ఎంత ప్రయత్నించినా ఒక పట్టాన అవలేదు. స్వరంలోని భావానికి బాణీలో అంత "చోటు" దొరకలేదు! చాలా హాయి స్వరం. బరువైన మాటలు. ఇమడ లేదు.

ఎంతో శ్రమపడ్డాక, చివరకి ఏదో ఇలా వచ్చింది-


*   *   *   *   *   *   *   *
మొదలిది కాదా
ముందే తెలుసా 
ఏ జన్మదో
అధరాలకీ యోగం
శృతి చాలని రాగం
ఎన్నాళ్ళ జ్ఞాపకం

మోవి చాటున మౌనం
అది ఏ రాగమో
మన ముందు జన్మల బంధం
ముడుపై దాచెనో
  
మొర వింటావుగా
ముకుళింత చేయగా
అమరుంటావుగా
అమరం చేయగా

అధరాలిలా అడిగాయిలా
బదులందక అలిగాయిలా

*   *   *   *   *   *   *   *



 
సంగీత సరస్వతి "ఇసై జ్ఞాని" ఇళయరాజాకి. భక్తితో.

Sunday, August 26, 2012

మిథునం

(అరవై ఏళ్ళ పాటు కలిసి ప్రయాణం చేసిన తరువాత, ఆ ముసలాణ్ణి ఒంటరివాణ్ణి చేసి ఆ ముసల్ది చచ్చిపోయింది. ఉన్నంత కాలం విసుగులు, విసుర్లు, కలహాలూ, కబుర్లూ అన్నీ ఉండేవి. కష్టం సుఖం కలిసే పడ్డారు.

ఎప్పుడో అరవయ్యేళ్ళ క్రితం పెళ్ళైన నాటి నుండి ఏనాడూ ఒంటరితనం అంటే తెలీని ఈ ముసలోడికి పెళ్ళాం పోయాక- తన ఇంట్లో కూడా - ఏదో భాష తెలీని దేశంలోకి తోసేస్తే ఒచ్చి పడ్డట్టుంది. అరవయ్యేళ్ళ జ్ఞాపకాలు అంత తేలిగ్గా వదలవు. ఇంట్లో ఎటు చూసినా, ఏం చేసినా సీతమ్మ గురుతులే.
అంకితం: తాతయ్య, అమ్మమ్మలు య.హరగోపాలరావు, సీతారావమ్మ లకి - ప్రేమతో.)


1
ప్రతిరోజూ లేస్తూనే
నిన్ను తలచుకోవాలని
నువ్వు లేని నీరవాన
ఒక్కడినీ ఏడ్వాలని
పథకమేసి చేశావు
బెడ్ కాఫీ అలవాటు.

నిన్న దాక లేస్తూనే
అలవాటైన నీ శబ్దం
నీవు లేని వంటింట్లో
శూన్యంతో నిశ్శబ్దం.

2
కుంపట్లో మంట లేదు
వంటింట్లో వంట లేదు
పంతంగా పాలు కాస్తే
కాలు దాక కాలింది.

నీ తలపులు తవ్వుకుంటు
తిట్టుకుంటూ పెట్టుకుంటే
ఈనాడే తెలిసింది
కాఫీ ఇంత చేదని.

3
నన్ను ఉంచి కన్నుగప్పి
నిన్ను లాక్కుపోయినందుకు
చూశావా పైవాడికి
బలే బాగయ్యింది-

పువ్వులేని పూజలేని
పాతబడ్డ పైన గూట్లో
బిక్కమొహం వేసుకుని
చీకట్లో దేవుడు.

4
కాలిన ఈ గాయాలకి
నెయ్యి తీసి రాస్తుంటే
'ఏవండీ వెన్నముద్ద
వెచ్చచేసి తెచ్చాను'
అన్నమాట గుర్తుకొచ్చి
కళ్ళనీళ్ళు వచ్చాయి.

5
పూజగదిలొ మూల అరలో
రోజూ ఏం దాస్తావో
ఏనాడూ చెప్పలేదు
చెక్క తలుపు తెరిచి చూస్తే-

వడియాల మరక బొట్లు,
పసుపూ కుంకం కూడా-
నిండు ముత్తైదువ లాంటి
మడివస్త్రం - నీ చీర.

6
ఈ చీరలొ నా జానకి
సీమంతం జరిగింది
ఈ చీరలొ అమ్మతనపు
కమ్మదనం చూసింది

సిగ్గేస్తే సీతమ్మకి
చీరంతా నవ్వింది
కోరుకున్న మొగుడిని
ఆ కొంగే దాచింది

ఏనాడో పిచ్చి మొగుడు మనసుపడి కొన్నాడని
ముసలి ముతక అయ్యాకా
మడికి దాన్నే వాడింది

ఎంత ప్రేమ పెట్టుకుంది పొట్టి చిట్టి తల్లి
ఎక్కడుందో నా చీరని నాకే వదిలి వెళ్ళి

7
ఏనాడూ మొగుడి మీద
చాడీలే చెప్పలేదు
కష్టాలూ ఇష్టాలూ
కడుపులోనే దాచింది

ఎక్కడ చచ్చావే ముసలీ
స్వర్గంలో ఎటు మూల
పుట్టింట్లో చెప్పినట్టు
పుట్టించి చెప్పబోకు

మొగుడెంత మారాజో దేవుళ్ళకి ఎరుకే
కప్పిపుచ్చి గొప్ప చెప్పే పప్పులేవి ఉడకవు

8
కుంకుడంత నుదుట బొట్టు
కుంకుమతో ఎర్రన
పాపిట్లో లచ్చువమ్మ
సీతమ్మకు దీవెన

నీ నోముల పుణ్యాలే
నాకు చుట్టుకున్నాయి
నువ్వు పోయి నేను మిగిలి
ఒంటరివాణ్ణి చేశాయి

9
తీరం లేని తెప్పల్లో,
తుప్పల్లో, తిప్పల్లో
ఒక్కడినీ నన్ను వదిలి
తప్పుకున్న కంత్రీ

నువ్వు తప్ప బలం లేని
చదరంగపు రాజుని
జాలి లేక వదిలెళ్ళిన
కరణేషు మంత్రి

Wednesday, August 15, 2012

ఒక్కడే దేవుడు

దేవుడు ఎవ్వరని
చీమని ప్రశ్నిస్తే
చీమనే చూపును దేవుడని

మహిమకు అర్థముని
చిట్టిమొలకతొ పలికిస్తే
మట్టినే చూపును మంత్రమని

మన రూపాన్నే దేవుడికిచ్చి
మార్చి మార్చి కొలిచే ఇజము
మనుషులు కాబట్టి
మతములు కనిపెట్టి
మార్చినారు పిలిచే విధము

Tuesday, August 14, 2012

కన్నెఎరుపు

అరచేతిలొ తడిచేసిన
గోరింట గోటినోము
సున్నంతో వక్కేసిన
తమలపాకు వక్షాలు

చూసిన కళ్ళు ఎరుపు,
పొందిన నోరు ఎరుపు.

Monday, August 13, 2012

కారాలు


ఆమె:
వంటలొ కారం హెచ్చా?
కోపగించుకోకండి
కారం తగిలిందంటే
మమకారం అని తెలియండి.

అతడు:
మమకారాలా మిథ్య
ఒట్టిమాటలాగుంది
అలంకారాల మధ్య
కారం పడిఉంటుంది.


Wednesday, August 8, 2012

పాడమన్నావు, పాడుతున్నాను.

తెలిసినదంతా పాడేశాను
తెలియని పాట పాడలేను
మనసు తెరిచి ఏం చెప్పాలన్నా
ఎపుడో ముందే పాడిన శూన్యం.
పాత పాటనే మళ్లీ పాడితె వింటావా
మరచిపోయిన నీకు కొత్తగనే ఉంటుందేమో

తోచినదంతా చెప్పాలంటే
మనసునదీ మరచినదీ
కలసిపోయినవి రంగుల బుడగలు
రంగులెంత రమ్యమైనా
బుడగ ప్రాణం బుద్బుద ప్రాయం

పదము నిచ్చెనలపై నింగినెక్కి
జంట కళ్ళతో కట్టుకున్న కలల లోకం
ఒంటి కంటితో మరల మరల కాంచే పిచ్చి భ్రమలో
అదే పాట, అవే కథలు, అలాగే పాడనా

ఇన్నినాళ్ళుగా పాడుతుఉన్నా
ఎపుడూ కలగని సందేహం–
మనసుకి మాయ చేసిందెప్పుడు,
నన్నునేను పోగొట్టుకున్న నిన్న మాయా
నాకే నేను అర్థంకాని నేడు మాయా

మాయ మధురం మోహం మధురం
మరపుకు రాని వలపే మధురం
గతమే మధురం గాయం మధురం
గాయం పాడే గేయం మధురం

మాయలొ ఉన్నా హాయిలొ ఉన్నా
మనసుకు తెలిసిందొకటే పాట
కాలం లోకం అన్నీ తోసి
ఇదిగో ఇప్పుడే పాడతా విను:

సూర్యుడి మేరు నా చెలి
ఎదురున్నా ఎటు ఉన్నా 
చందమామ ప్రకాశాన ప్రతిబింబము తానె

బ్రహ్మము తీరు నా సఖి
పాట మార్చినా రాగం మారినా
పదము పదమునా అక్షరం చాటు అందము తానె.


Thursday, June 14, 2012

adagio sostenuto

షెల్లీ కుంచె పట్టుకుంటే గొప్ప ప్రకృతి చిత్రకారుడయ్యేవాడేమో
డావిన్సీ గీయకుండా వ్రాసి ఉంటే మోనాలిసా కావ్యమయ్యేదా?
రవీంద్రుడి కలల ఆర్తీభావం శిలలో మూర్తీభవించి ఉంటే
గీతాంజలి శిల్పాంజలి అయ్యేదేమో.
పికాసో బొమ్మ తన సోకాపి సోనెట్లు పాడితే
అది సొనాటా అవుతుందా.

మైకెలాంజెలో వ్రాసిన గేయం వర్డ్సువర్తు చెక్కిన శిల్పం
తాన్ సేన్ ఆడిన నాట్యం రవివర్మ పాడిన పద్యం-

అన్నట్టు చెప్పానా నీకు

నీ కళ్ళలోకి చూస్తూ
నీ శ్వాసకి ఆడే నా గుండెచప్పుడు ఆర్పేజియో
బీథోవెన్ మూన్ లైట్ ప్రవాహంలా
adagio sostenuto అవుతుందని.

Monday, May 21, 2012

నమ్మించవే

నా కళ్ళకి ఇక కనపడనంటూ నమ్మించవే
నా గుండెకి వినపడనంటూ వివరించవే

కళ్ళకి నువ్విక కనపడకున్నా
నీ గురుతులతో జీవిస్తున్నా
నువ్విక లేవని మనసుని ఎవరూ నమ్మించరే

నువ్వూ నేనని కలలే కన్నా
మళ్ళీ రావని అలవడుతున్నా
కళ్ళని కలలని నన్నూ కలిపి కప్పేయరే


Sunday, May 20, 2012

పూసలు

అంగుగా అల్లిన మన కలల దండ
తెంపేసి ఒంపేసి నువు వెళ్లిపోతే
నేలంత ఒలికిన నాటి ఊసుల్ని
ఎవరికీ చెల్లని ఈ ఒట్టి పూసల్ని
ఒక్కటొక్కటి తీసి నేనేరుకుంటే

పూస పూసలో కదిలి నీ చిన్నినవ్వు 
గురుతొచ్చి నాకళ్ళ నీవె నిండంగా
గుండె గొంతుకతోన ఎంకన్నసామికి
కళ్ళ నిండుగ నీట నేను మొక్కంగా
చల్లంగ ఉండాలి నా చిట్టితల్లి
ఏలుకునే చేతుల్లొ ఎంకన్న కడుపులో.

Monday, April 30, 2012

వెళ్ళిపోవే

వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో నాలో ఊపిరి తీసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక
వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే నన్నే ఒంటరి చేసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్లీ రాకిక

నా మనసులోని సంతకాలు
గుర్తుకొచ్చే జ్ఞాపకాలు
దాచలేనే మొయ్యలేనే తీసుకెళిపోవే
మార్చుకున్న పుస్తకాలు
రాసుకున్న ఉత్తరాలు
కట్టకట్టి మంటలోన వేసిపోవే

అటువైపో ఇటువైపో ఎటు ఎటు అడుగులు వెయ్యాలో
తెలియని ఈ తికమకలో తోసేశావేంటే ప్రేమా
నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా
నాలాగా ఏనాడూ నువ్వనుకోలేదా ప్రేమా?


ఎంతలా నిన్ను నమ్ముకున్నాను
ఆశలెన్నో పెట్టుకున్నాను
కన్నకలలన్ని కాలిపోతుంటే ప్రాణం ఉంటుందా

తలపుల్లో తడిపేసే చినుకనుకున్నా వలపంటే
కన్నుల్లో కన్నీటి వరదైపోయవే ప్రేమా


చిరు చిటికెడంతైన జాలిలేదా
తట్టుకోలేను ఇంత బాధ
అడగలేక అడుగుతున్నా
నేను నీకేమి కానా?


----
రాసింది భాస్కరభట్ల. రాసుకుంది నేను.

Sunday, April 22, 2012

సీత లాలి

జో అచ్యుతానంద జో జో రా
జో జో - జోజో జోజో
రావే పరమానంద నా గోవిందా
జో జో - స్వామీ బజ్జో

నీలాకాశాన్నే పందిరి చేసి
ఈ చుక్కలతోనే పక్కను వేసి
వీచే గాలి వింజామర చేసి
పూచే పూల పూసెజ్జేసి

నిన్ను- ఆ మిన్ను-లోనున్న- ఆ చిన్నజాబిలి చేసి-

హిందోళ రాగంలో మనసాడగా
ఈ వేళ నీ లాలి నే పాడనా
జోజో జోజో జోజో
జోజో జోజో జోజో


చరణం 1
ఆకేసి పప్పేసి - బువ్వేసి నెయ్యేసి
అత్తవారింటికి నిను పంపేయను
వలపేసి వక్కేసి - పరుపేసి పక్కేసి
నా పక్కనే దాచుకుంటాను

రేయి తెలవారని ఝాములో
హాయి నా లాలితో
మంచి కథ కంచి చేరేంతలో
దాచి నా కొంగులో

ఒళ్ళో- కౌగిళ్ళో -చన్నుల్లో- కన్నుల్లో పాపను చేసి-

నా గాలి పాటల్ని ఈ లాలిగా
రాగాలు తీసేటి ఇల్లాలిగా
జోజో జోజో జోజో
జోజో జోజో జోజో


చరణం 2
ఆ నిండు జాబిల్లి వలవేసి తేలేను
మారాముల మా రాముకి గారాబంగా
ఈ బొండు మల్లెల్ని వలపేసి అల్లేను
చండుని చందురుడనుకో బంగారంగా

వాలు జడ ఉంది నీ ఆటకే
ఇచ్చా నీ చేతికి
అల్లరి చాలించి ఈ పూటకి
బజ్జోరా నా తండ్రివి

మైకం కమ్మంగా - చల్లని కలలే కమ్మంగా-కంటుండాలని

నీ చిట్టితల్లే నీ తల్లిగా
జోకొట్టుతుంటే మెలమెల్లగా

జోజో జోజో జోజో
జోజో స్వామీ బజ్జో


----------------------------------------------
'చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి' లో ప్రసన్న పాడే పాట.

original గా పల్లవిలో "నీలాంబరాన్నే పందిరి చేసి- నీలాంబరి లోనే పాటను వ్రాసి" అని రాశాను. నీలాంబరి లాలి రాగం. కాని ఈ పాట రాగం హిందోళానికి దగ్గరగా ఉందనిపించి దానిని మార్చాను. పల్లవి, మొదటి చరణాలు రాసింది 2000 రోజుల్లో.

20-ఏప్రిల్-2012

Sunday, April 1, 2012

శ్రీసుందరరామ నవమి



మా సుందరరాముడికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
రామకృష్ణ.

Saturday, February 18, 2012

ప్రశ్నలు

వింటున్నావా కంటున్నావా
జరిగేదంతా అంటూ ప్రేమ
తెలిసే ఇట్లా ఉంటున్నావా
ఏమయ్యిందని అడిగిందమ్మా

కథచేప్పే జ్ఞాపకాలని
కలలాగా మరచిపోతివా
కలకాని ఈ నిజాలలో
శిలలా నిలిచావా

వలపంటే ఒట్టిమాటని
సులభంగా ఒప్పుకుంటివా
మనసులకే పడిన ముడులని
ముళ్ళని అంటావా

వింటున్నావా..

Thursday, February 9, 2012

సర్వ శిక్షా అభియాన్












పిల్లలు చదవాలి
అల్లరి చేయాలి
ఆటా పాటా చదువూ సంధ్యా అన్నీ ఉండాలి
పాటలు పాడాలి
పాఠం నేర్వాలి
పాలబుగ్గల పసివయసుల్లో వెలుగే నిండాలి

చాకిరి వద్దండి
చదువే నేర్పండి
వెలుగిచ్చేది గెలిపించేది
చదువేనండి
భవితకు ఆకారం
చదువుకు శ్రీకారం
అఆఇఈ ఉఊఎఏ
మనకిక ఓంకారం

పసిపిల్లలు
పనిపిల్లలు కారు
పసి చేతులతో పసిడి భారతపు పాదులు వేస్తారు
ఈ బాలలు
బాలకార్మికులు కారు
బడికే పంపితే భావిభారతపు నిర్మాతలు వీరు


Monday, January 30, 2012

ప్రభావతి






చిత్రంలో కలిసి
చిత్రంగా నను లాగేసి
తన మాయలో పడేసి

చతురంగా చూసి
ఇక ఇతరత్రాలన్నీ తోసి
అన్నీ తానయ్యే రాక్షసి

ఇన్నేళ్ళ వయసున్నా పిల్లాణ్ణి ఐపోతున్నా
ఇల్లైనా గుళ్ళో అయినా చిల్లర అల్లరి చేస్తున్నా
పరువులేని పనులైనా పట్టుబట్టి కానిస్తున్నా
పగ్గాలు లేకుండా మరి పడుతూ లేస్తూ పరిగెడుతున్నా

ప్రేమించా నిన్నే ప్రభావతి
ప్రాణంగా మారే నీ ప్రతికృతి
ప్రవచించా నీకై ప్రతీ కృతి
నను ముంచేశావే నా ప్రకృతి

చరణం 1
అతడు: నిన్న మొన్న లేనెలేని కొత్త ఆశ ఏదొ పుట్టి
నన్ను చూసి నవ్విందిగా
ఆమె: మాటలోన చెప్పలేని మనసులోన దాచలేని
వింత చూడు ఇబ్బందిగా
అతడు: నేనే లేని నాలో- నన్నే నేను ఎంతో వెతికా
నీకేదో కానుక ఇవ్వాలని
నన్నే దాచి నీలో - నవ్వేస్తావు ఏదో ఇదిగా
నేనేం చేస్తానో చూద్దామని

పోతోందే ఉన్న మతి
ఆపెయ్యవే బాణామతి
లేకుండా ఇంకే పరిమితి
నా ప్రపంచమే నువ్వే ప్రభావతి

Tuesday, January 17, 2012

భామకి-


నిన్నూ పోనిచ్చెదనా  సత్యభామా నిన్నూ పోనిచ్చెదనా
నన్ను ప్రేమించగా ఎన్ని విధముల నీ వెంట రానా
భామా.. భామా.. ||నిన్నూ||

బెట్టు చేసే నీ పనిపట్టుదునింక
వీలుకలిగితే ముద్దు పెట్టుకోనా
గట్టిగ నీ లేత సొగసులనెప్పుడో
పట్టి కౌగిలిలో కట్టి వేయుదు భామా

పడిపడి నీ వెంటబడి తిరుగగనెంతో
దొరకక నీవెందుకు జరిగెదవే భామా
గొడవకు నీ తలిదండ్రులే వచ్చిన గాని
విడిచిపెట్టని నీ నీడను నేనే భామా

అందానివని మొగమాటము లేకుండా
పువ్వులిచ్చి లవ్వు చేయుదునే భామా
నీవే నా హృదయాలయ నిలయివై నన్ను
తరియింపవమ్మా తళుకు లేమా ఓ భామా

అద్దంలాంటి బుగ్గ

అద్దంలాంటి బుగ్గకు కాస్త ముద్దు చూపవా ప్రియతమా
అందం దాచి అందుకు వేచి ఉన్నా నీకై ప్రాణమా
ఎదిగిన వయసున ఎదలో కోరిక దాచితే దాగలేదు
అల్లరి సిగ్గున అదిరే పెదవికి చెప్పటం చాత కాదు
అందుకే చెప్పకే అర్థం చేసుకో
అందులో హాయిని అర్థం పంచుకో

రంగీల


పిల్లో నీ నంగనాచి నడుము చూసి నడక చూసి
చే లో నీ వెంటపడి సీటి కొట్టానే
బుల్లో నీ  బుంగమూతి పొగరు చూసి ఫిగరు చూసి
కల్లో నే ఫికరు లేక కన్నుకొట్టానే
అబ్బో వయ్యారం చూపే సింగారం
వద్దే వడ్డాణం నడకే నయగారం

అందీ అందక ఊరిస్తూ నీ అందాలే నన్ను కవ్విస్తే
ముంజెల్లాంటి  బుగ్గలు చూసి ముద్దిచ్చే మహా మూడొచ్చే

కన్ను నేను కొట్టబట్టి నన్ను నువ్వు తప్పుబట్టి
కాలే దువ్వకే కయ్యాన
చేనుకాడ చెంగుబట్టి పాతపైట లాగబట్టి
నేనో పోకిరీ నయ్యానా
దిల్లే ఉందిలే పిల్లా నిన్నే చూస్తూ పాడనా తిల్లానా  
సూదల్లే గుచ్చితే నీ చూపుల్తో అట్టే పడిపోనా వల్లోన 

ఎవరెస్ట్ లాంటి సొగసులు చూస్తే ఈలేసేలా ఈడొచ్చి
గోదారంటి నడుముని చూసి ఈదేసే మహా మూడొచ్చే