Sunday, August 26, 2012

మిథునం

(అరవై ఏళ్ళ పాటు కలిసి ప్రయాణం చేసిన తరువాత, ఆ ముసలాణ్ణి ఒంటరివాణ్ణి చేసి ఆ ముసల్ది చచ్చిపోయింది. ఉన్నంత కాలం విసుగులు, విసుర్లు, కలహాలూ, కబుర్లూ అన్నీ ఉండేవి. కష్టం సుఖం కలిసే పడ్డారు.

ఎప్పుడో అరవయ్యేళ్ళ క్రితం పెళ్ళైన నాటి నుండి ఏనాడూ ఒంటరితనం అంటే తెలీని ఈ ముసలోడికి పెళ్ళాం పోయాక- తన ఇంట్లో కూడా - ఏదో భాష తెలీని దేశంలోకి తోసేస్తే ఒచ్చి పడ్డట్టుంది. అరవయ్యేళ్ళ జ్ఞాపకాలు అంత తేలిగ్గా వదలవు. ఇంట్లో ఎటు చూసినా, ఏం చేసినా సీతమ్మ గురుతులే.
అంకితం: తాతయ్య, అమ్మమ్మలు య.హరగోపాలరావు, సీతారావమ్మ లకి - ప్రేమతో.)


1
ప్రతిరోజూ లేస్తూనే
నిన్ను తలచుకోవాలని
నువ్వు లేని నీరవాన
ఒక్కడినీ ఏడ్వాలని
పథకమేసి చేశావు
బెడ్ కాఫీ అలవాటు.

నిన్న దాక లేస్తూనే
అలవాటైన నీ శబ్దం
నీవు లేని వంటింట్లో
శూన్యంతో నిశ్శబ్దం.

2
కుంపట్లో మంట లేదు
వంటింట్లో వంట లేదు
పంతంగా పాలు కాస్తే
కాలు దాక కాలింది.

నీ తలపులు తవ్వుకుంటు
తిట్టుకుంటూ పెట్టుకుంటే
ఈనాడే తెలిసింది
కాఫీ ఇంత చేదని.

3
నన్ను ఉంచి కన్నుగప్పి
నిన్ను లాక్కుపోయినందుకు
చూశావా పైవాడికి
బలే బాగయ్యింది-

పువ్వులేని పూజలేని
పాతబడ్డ పైన గూట్లో
బిక్కమొహం వేసుకుని
చీకట్లో దేవుడు.

4
కాలిన ఈ గాయాలకి
నెయ్యి తీసి రాస్తుంటే
'ఏవండీ వెన్నముద్ద
వెచ్చచేసి తెచ్చాను'
అన్నమాట గుర్తుకొచ్చి
కళ్ళనీళ్ళు వచ్చాయి.

5
పూజగదిలొ మూల అరలో
రోజూ ఏం దాస్తావో
ఏనాడూ చెప్పలేదు
చెక్క తలుపు తెరిచి చూస్తే-

వడియాల మరక బొట్లు,
పసుపూ కుంకం కూడా-
నిండు ముత్తైదువ లాంటి
మడివస్త్రం - నీ చీర.

6
ఈ చీరలొ నా జానకి
సీమంతం జరిగింది
ఈ చీరలొ అమ్మతనపు
కమ్మదనం చూసింది

సిగ్గేస్తే సీతమ్మకి
చీరంతా నవ్వింది
కోరుకున్న మొగుడిని
ఆ కొంగే దాచింది

ఏనాడో పిచ్చి మొగుడు మనసుపడి కొన్నాడని
ముసలి ముతక అయ్యాకా
మడికి దాన్నే వాడింది

ఎంత ప్రేమ పెట్టుకుంది పొట్టి చిట్టి తల్లి
ఎక్కడుందో నా చీరని నాకే వదిలి వెళ్ళి

7
ఏనాడూ మొగుడి మీద
చాడీలే చెప్పలేదు
కష్టాలూ ఇష్టాలూ
కడుపులోనే దాచింది

ఎక్కడ చచ్చావే ముసలీ
స్వర్గంలో ఎటు మూల
పుట్టింట్లో చెప్పినట్టు
పుట్టించి చెప్పబోకు

మొగుడెంత మారాజో దేవుళ్ళకి ఎరుకే
కప్పిపుచ్చి గొప్ప చెప్పే పప్పులేవి ఉడకవు

8
కుంకుడంత నుదుట బొట్టు
కుంకుమతో ఎర్రన
పాపిట్లో లచ్చువమ్మ
సీతమ్మకు దీవెన

నీ నోముల పుణ్యాలే
నాకు చుట్టుకున్నాయి
నువ్వు పోయి నేను మిగిలి
ఒంటరివాణ్ణి చేశాయి

9
తీరం లేని తెప్పల్లో,
తుప్పల్లో, తిప్పల్లో
ఒక్కడినీ నన్ను వదిలి
తప్పుకున్న కంత్రీ

నువ్వు తప్ప బలం లేని
చదరంగపు రాజుని
జాలి లేక వదిలెళ్ళిన
కరణేషు మంత్రి

Wednesday, August 15, 2012

ఒక్కడే దేవుడు

దేవుడు ఎవ్వరని
చీమని ప్రశ్నిస్తే
చీమనే చూపును దేవుడని

మహిమకు అర్థముని
చిట్టిమొలకతొ పలికిస్తే
మట్టినే చూపును మంత్రమని

మన రూపాన్నే దేవుడికిచ్చి
మార్చి మార్చి కొలిచే ఇజము
మనుషులు కాబట్టి
మతములు కనిపెట్టి
మార్చినారు పిలిచే విధము

Tuesday, August 14, 2012

కన్నెఎరుపు

అరచేతిలొ తడిచేసిన
గోరింట గోటినోము
సున్నంతో వక్కేసిన
తమలపాకు వక్షాలు

చూసిన కళ్ళు ఎరుపు,
పొందిన నోరు ఎరుపు.

Monday, August 13, 2012

కారాలు


ఆమె:
వంటలొ కారం హెచ్చా?
కోపగించుకోకండి
కారం తగిలిందంటే
మమకారం అని తెలియండి.

అతడు:
మమకారాలా మిథ్య
ఒట్టిమాటలాగుంది
అలంకారాల మధ్య
కారం పడిఉంటుంది.


Wednesday, August 8, 2012

పాడమన్నావు, పాడుతున్నాను.

తెలిసినదంతా పాడేశాను
తెలియని పాట పాడలేను
మనసు తెరిచి ఏం చెప్పాలన్నా
ఎపుడో ముందే పాడిన శూన్యం.
పాత పాటనే మళ్లీ పాడితె వింటావా
మరచిపోయిన నీకు కొత్తగనే ఉంటుందేమో

తోచినదంతా చెప్పాలంటే
మనసునదీ మరచినదీ
కలసిపోయినవి రంగుల బుడగలు
రంగులెంత రమ్యమైనా
బుడగ ప్రాణం బుద్బుద ప్రాయం

పదము నిచ్చెనలపై నింగినెక్కి
జంట కళ్ళతో కట్టుకున్న కలల లోకం
ఒంటి కంటితో మరల మరల కాంచే పిచ్చి భ్రమలో
అదే పాట, అవే కథలు, అలాగే పాడనా

ఇన్నినాళ్ళుగా పాడుతుఉన్నా
ఎపుడూ కలగని సందేహం–
మనసుకి మాయ చేసిందెప్పుడు,
నన్నునేను పోగొట్టుకున్న నిన్న మాయా
నాకే నేను అర్థంకాని నేడు మాయా

మాయ మధురం మోహం మధురం
మరపుకు రాని వలపే మధురం
గతమే మధురం గాయం మధురం
గాయం పాడే గేయం మధురం

మాయలొ ఉన్నా హాయిలొ ఉన్నా
మనసుకు తెలిసిందొకటే పాట
కాలం లోకం అన్నీ తోసి
ఇదిగో ఇప్పుడే పాడతా విను:

సూర్యుడి మేరు నా చెలి
ఎదురున్నా ఎటు ఉన్నా 
చందమామ ప్రకాశాన ప్రతిబింబము తానె

బ్రహ్మము తీరు నా సఖి
పాట మార్చినా రాగం మారినా
పదము పదమునా అక్షరం చాటు అందము తానె.