Wednesday, December 16, 2009

అంతులేని లోకం అంచున నువ్వూ నేనూ ములాకత్

కంటిబొట్టు బరువైనా కారదేం కళ్ళల్లో
గుండె కొట్టుకుంటూనే ఉంటుందా నువ్వులేని జన్మల్లో
నువ్వు లేని లోకంలో నన్నొదిలి వెళ్ళిపోయావు.
ఆగని ఈ గుండెలో నీ గురుతులొదిలిపోయావు.
అద్దమైతె పగిలేది, అగ్గిఐతె రగిలేది
వ్యర్థమైంది గుండె కనుక
ఏడుస్తూ మిగిలేది.

Thursday, December 10, 2009

చంద్రుడ్లో ఉండే కుందేలు

ఇద్దరం డాబా మీద కూర్చుని బుడగలు ఊదుదాం.
పౌర్ణమిలో చెప్పుకునే చందమామ కథలు, అమావాస్యలో లెక్కపెట్టే అందమైన నక్షత్రాలు, ఆకాశం లో ఎగురుతూ పోయే గుర్తు తెలీని పక్షి గురించి 'దాని పేరు సుబ్బయ్య, దానికి నలుగురు పిల్లలు' అనుకుంటూ కథలు చెప్పుకోవటం, అరచేతులు తల కింద పెట్టుకుని ఆకాశం వైపు చుస్తుంటూంటే అకస్మాత్తుగా నువ్వు దగ్గరికొచ్చి ఉఫ్ మంటూ కళ్ళలో ఊది నవ్వేసేయటం, sudden గా దగ్గరికొస్తే ముద్దుపెట్టేసుకుంటానేమో అని పెదాలకి చేతులు అడ్డంపెట్టుకుంటే నేను ప్రక్కకి తిరిగి 'కూ..' అని చెవిలో గట్టిగా అరవటం, ఐదు నిమిషాల పాటు గుయ్ మంటూ గొంతు చెవిలో ఓంకారం లా...

ప్రొద్దున్నే లేచి ప్రేమించుకుని, ప్రేమించుకుంటూ ప్రేమించుకున్నాక, ప్రేమించి, తరువాత ప్రేమిస్తూ, ప్రేమతోనే నిద్రపోతూంటే, చూస్తుండగానే రోజు గడిచిపోతుంది కదూ..

ప్రేమ కన్నా పెద్ద పదం లేకపోవటం ప్రేమ చేసుకున్న అదృష్టం అనుకునే వాడిని. కానీ కాదు...


పెదవులు చేసుకున్న అదృష్టం.

Tuesday, December 1, 2009

నీ స్పర్శ...

స్పందించే ప్రతి అణువు అణువునూ సంధించే నీ స్పర్శ
నన్నంటి ప్రతి క్షణక్షణానా వెంటాడే నీ స్పర్శ
నీ చేతి గమనాల నువు మీటే గమకాల
ఆ తీపి తమకాల గమ్మత్తైన స్పర్శ!

చల్లని తెమ్మెర తాకిన చెంపకి నీ ముద్దు స్పర్శ
వెచ్చని సిగ్గులు కమ్మిన బుగ్గకి నీ చూపు స్పర్శ
నల్లని నా జడ బరువుకి పరువుకి నీ గొడవ స్పర్శ
అల్లరి వేళల నడుమున మడతకి నీ చొరవ స్పర్శ

మీగడ తెరకలు తగిలిన పెదవికి నీ ఆశ స్పర్శ
ఎర్రని మరకలు పగిలిన పెదవికి నీ గాటు స్పర్శ
కోరిక ఊపిరి పొదిగిన గుండెకి నీ శ్వాస స్పర్శ
ఊహల దుప్పటి కప్పిన ఒంటికి నీ వేటు స్పర్శ

ప్రతి స్పర్శా నీదనిపిస్తూ
అన్నింటా నువు కనిపిస్తూ
లేస్తూనే నీ శ్రీరస్తు
సిగ్గుల నవ్వులు తెస్తూ...