Thursday, November 29, 2012

ఆమె జడ

"దాని సన్నాయి జళ్ళోన సంపెంగ" అన్న వేటూరి లైన్ విని ఆశువుగా రాసిన లైన్స్ (ఇవి ఛందస్సులో ఉండవు):

నక్తము రంగు తీరు, ముక్తాయి పై బారు; ఆ
ముక్తమై ముక్తమౌనే పసిమొగ్గ కూడ; అట్టి
కీర్తియుందలచి కొలిచి, వ్యక్తము చేసి చూడ
కడు వక్తకు కూడ సూక్తము రిక్తము.

పిరుదుల్ తాకునట్టి బిరుదుల్ గల్గెనో
విరులన్ దాచిన వెన్నెల సెలయేటి కురుల్;
అరుదైనట్టి కుప్పెలు, కొప్పున అమరెను గదా
మరుడే నల్లగడ సన్నాయి జడను బట్టి.


పోతే ఆ జడ అందాన్ని కందాలుగా మార్చితే:

కందం.
నక్తము రంగై మెరిసెన్
ముక్తాయటు బారు తీసి ముదమున నొసగెన్
ముక్తి ని పొందెను పూవా
ముక్తమవగ లలన వాలు పూజడ నందున్

కందం.
వ్యక్తము చేయగ వశమే
వక్తకయిన వాలు జడను వలచుట కన్నన్
రిక్తమవును తన హృదయము
రక్తి నొసగు కురుల సిరి తలచిన సమయమున్

కందం.
పిరుదుల్ తాకెడి బిరుదుల్
పరులిచ్చిరి కుప్పె నటన పరికింపగనే
మరుడే అమరెను కొప్పున
నలుపు చెరకు గడగ జడను నయముగ మీటన్


Monday, November 19, 2012

ప్రణయగానం

మన కథే మరులుగా మెరిసెనో
అమరమై ఈ విరులుగా విరిసెనో
ప్రేమదేవతార్చనై
నీ గళం నా గళం కలసి గానము చేయగా

వెల్లువై వెన్నెల
వెలను దాచిన అలలుగా
వెనుక విన్న కలల సాక్ష్యమిచ్చెనో
ఆ నాటి ఆశ
వీడనన్న బాస
నీ పాటై నా పాటై నిలిచి ఉండునో

పాడనీ వరమని
కలసి కన్న కలలని
కలయికైన చెలిమి ఏ తొలి బంధమో
కాలాల తోటి
జన్మాలు దాటి
నీవెవరో నేనెవరో
ఏల కలిశామో

చెదరదీ బంధమే
మనవి చేసెను హృదయమే
ప్రణవమంటి ప్రణయమే నా ప్రాణమై
నా కంటి నిండా నీ రూపు నింపి
అలుపులేక ఎలమి గానం ఆలపించనీ