Wednesday, October 12, 2016

అంతరాయం

అంతరాయం (సునీత గంగవరపు)
......................
మన ఎన్నో రాత్రులు కలిసి పంచుకున్నాం
చందమామ వెన్నెలలూ
నక్షత్రాల సోయగాలు
ఒకరి కళ్లలోంచి మరొకరం దోచుకుంటూ..
కదులుతున్న చేతివేళ్ల కొనలతో
స్పర్శానుభూతిని చిత్రీకరిస్తూ..

నిశ్శబ్ద ఊసులనే ఊపిరిగా శ్వాశిస్తూ మనం..
ఎన్నో రాత్రులు కలసి ఆస్వాదించాం
ఇంతలో...ఏమయిందో తెలియదు
అనుమానమో..అసంతృప్తో...ఆత్మన్యూనతో - ఏమిటో అర్దం కాదు

ఆకాశం రెండుగా విడిపోయిన భావన...ఆశలను అనుభూతులను
అమాంతం మింగేసిన అలజడి
కట్ చేస్తే....

జీవితానికి అటువైపు
నిప్పులు చెరుగుతూ నీవు..
ఇక్కడ నిశ్చెష్టనై చూస్తూ నేను!
మనం ఏకమవ్వాల్సిన దారిని
ఎవరో చెరిపేసిన గుర్తులు
బహుశా..ఈ జన్మకిక ఇంతేనేమో..

సునీత.జి -


------------------------------------------------------
సునీత గారు వ్రాసిన కవిత చదివి ఇది రాయకుండా ఉండలేక పోయాను:


ఇంతే కాదు
ఇది అంతం కాదు
చెంతకీ చింతకీ మధ్య
చిన్న
అంతరాయం మాత్రమే

గెలిచి చూడు
ఈ పాడు అహాలను
వలిచి చూడు
అనుమాన పొరలను
పిలిచి చూడు
నీలో సగాన్నే- నా
మనసు చూడు
దిగంబరంగా

వెల కట్టకు
మన వలపు తలపులకు
లెక్కెట్టకు
మన తప్పొప్పులను
వలపించిన
ఆ మధుర స్మృతులకే
విలపించకు
విషాదమంటూ

కష్టం సౌఖ్యం
అన్నీ చూసి
కలిసున్నాంగా
గతకాలంలో
గో- ఇగో ల
గొడవల గోలల్లో
మరిచావా
మన సంగమ శృతులు

బరువెక్కిన హృదయం మునిగే
విభేదాల తిమిరంలోన
పిలవలేని పలకై నిలిచాం
శిలలయ్యిన శరీరాలతో

ముందున్నది ఎంతో కాలం
చెల్లించకు ఇంకా మూల్యం
ఒక్కసారి కలిసి నడిస్తే
మనసులకే మరో ముడేస్తే
చెల్లును ఈ విషాద యోగం
శాశ్వతమీ వివాహ బంధం


Tuesday, October 11, 2016

చారులీల

మన తెలుగింటి చారు గురించి డాక్టర్ జి.వి. పూర్ణచందు గారు వ్రాసిన అద్భుతమైన వ్యాసం చదివి అప్పటికప్పుడు వ్రాసిన వాక్యాలు.
------------------------

గిన్నె నిండు
నీరు పోసి
కాస్త వేసి
చింతపండు

సారమైన చారుపొడిని
సాదరముగ జల్లుచేసి
కొత్తిమీర కరేపాకు
కోర్కెమీర కొసరి వేసి

మంట మీద మరగబెట్టి
ఇంగువేసి పోపుపెట్టి
వేగమె తేగా వేడరా
వేడిగ బాగా తాగరా

రసము తోనే రససిద్ధి
రసము కూర్చు సరసవృద్ధి
కల్ల కాదు చారులీల
కలిపి చూడు విచారమేల

కాచి మరుగు చారుతాగి
రుచి మరిగిన తెలుగువాడు
చురుకు పెరిగి వయసు తరిగి
వంద యేళ్ళు వదిలి పోడు.



Saturday, October 8, 2016

విరిగిన స్మృతులే

విరిగిన స్మృతులే
విరహపు వెతలై
కరిగిన కలలే
కలతల నిదురై

చెదిరిన చెలిమే
చెరగని గురుతై
పిలిచిన పిలుపే 
పలకని వలపై 

నువు లేవన్న ఈ లోకం
నన్నే మోసం చేస్తున్నా
గతమే గమ్యంగా
గానం చేస్తున్నా

దీపం నీ రూపం
నన్నే కాలుస్తున్నా
ఈగై నీ చుట్టూ 
నాట్యం చేస్తున్నా

ప్రేమా ప్రేమా ఈ ఆనందం 
ఏ బంధంతో కొనగలవమ్మా 
సత్యం శూన్యం ఏకం ఐన 
శోకం కూడా బాగుందమ్మా



రాండమ్ మ్యూసింగ్స్


1

మనసులోన మడతపడ్డ
మరువలేని గతాలు
కంటి ముందు కదలాడే
కఠినమైన నిజాలు

అందమైన అబద్ధాల
అద్దాల కలల మేడల్లో
అసత్యాన్ని సత్యం చేసే
అసాధ్యం సాధ్యపడక

నిజం కాని నీ నీడల్లో
అబద్ధంగానైనా బ్రతకాలని
నీ నవ్వుల దివిటీలతొ
తలపులన్ని తవ్వుతూ

కను తెరిచిన కానరాని
నీ జాడల జగత్తుకై
కన్ను మూయాలని ఉంది,
ఏం చెయ్యను ?


2
బరువైన హృదయం
విరహాన మునిగి

ప్రేమ ప్రతుల
పాత వ్రాతలు
వాతల్లా
పైకి తేలాయి



3
నీ నవ్వే పువ్వై
నా నవ్వే నువ్వై
ప్రతిరోజూ విరబూస్తుంటే
లేవంటావెందుకు
తోటంతా తిరుగాడుతూ



4
నవ్వూ నువ్వే
శోకం నువ్వే
శూన్యంలో
నా లోకం నువ్వే


5
కదిలే కాలం 
కదలదే వెనక్కు రమ్మంటే 
చిన్నముల్లే పెద్దముల్లై 
పరుగెత్తేదే నువ్వుంటే 

కానివి తలచి 
కావని తెలిసి
నిన్నే నాలో నింపుకుని 
గతంలోనే జీవిస్తున్నా 
వర్తమానంలో బ్రతికున్నా 

ప్రేమా నా హృదయ చిరునామా