Thursday, November 10, 2016

ఆత్మ జ్యోతి

నువ్వు దయతో ప్రసాదించిన ఈ ప్రాణాన్ని
ఏదోరోజు తిరిగి తీసేసుకుంటావని తెలుసు.
కరుణామయుడివి నువ్వు,
తిరిగొచ్చేటప్పుడు నేనేదో తీసుకువస్తానని ఆశించవు.

ఏ ఆజ్ఞతో నన్నిక్కడకి పంపావో
ఆ లక్ష్యం పరిసమాప్తి అయినప్పుడు
నాకింకా పని పెట్టవు.
నేనేనాడో వదిలొచ్చిన 
అనురాగామృత హస్తాలతో నన్ను తడిమి 
నీ ఉక్కు కౌగిట నన్ను అక్కున చేర్చుకుంటావు.

జన్మకొక్కసారి మాత్రమే లభించే 
నీ ఆత్మీయ వెచ్చని స్పర్శ కోసం
ప్రతిరోజూ పని ముగించుకుని 
కొమ్మ మీద విరిసే కోమల కుసుమంలా
కోర్కెల ముళ్ళ కంబళి కప్పుకుని 
దక్షిణ కనుమల్లో దీపంతో ఎదురుచూస్తూ ఉంటాను.

నన్ను నా ఈశ్వరుని చెంత చేర్చే 
మృత్యుదేవత వచ్చినపుడు
కన్నీటితో ఆయనకు ఎదురవను.
ఊపిరి శ్వాసల హారతితో 
ఎర్ర కుంకుమ దిద్ది 
ఆయన పాదాలకు నమస్కరిస్తాను.

నన్నింతకాలం ఆదరించిన 
ఈ ఇంద్ర ధనుసు వర్ణాలనీ సప్త స్వరాలనీ
ఆత్మీయ బంధాలనీ ఎదలో భావాలనీ 
అన్నిటినీ ఇక్కడే వదిలేసి 
నడుచుకుంటూ నిన్ను చేరుతాను.

అంతా నీదైన నన్ను 
ఆత్మజ్యోతి లాంతర్లో 
బ్రహ్మానందపు వాడల్లో 
వేలు పట్టి నడిపించే ఈశ్వరా,
రిక్తహస్తాలతో 
దిగంబర దేహంతో
అర్పించుకోవటం మించి 
ఏమివ్వగలను నేను.

Wednesday, November 9, 2016

ప్రాణజ్యోతి

ఎంతో పాడాలి పాడాలి అనుకుంటూనే-
ఇంకా పాట ప్రారంభించలేదు నేను
వాద్యాన్ని శృతి చేయటంతోనే
చాలా సమయం గడిచిపోయింది
హృదయాంతరాల్లోని ఉద్వేగం
చేతి మునివేళ్ళ చివరి వణుకై
తంత్రుల మీద తచ్చాడుతోంది-
నీ ముందు నా పాట...!

కోయిల కూసినా పూవులు కదిలినా
మందస్మితం చేసే నువ్వు
కాకుల రాగాలకీ ఖరముల గానాలకీ కూడా
తన్మయత్వంతో తలాడిస్తావని తెలుసు
కరుణామృత సమవర్తివి కదా
అయినా సరే భయం, సంశయం.

తీరా సమయం వచ్చేసరికి
ఎంతో ప్రయత్నించాను-
నా ప్రేమంతా ప్రార్థనతో వ్యక్తం చేసి
నా హృదయపు మట్టి పాత్రను
నీ పాదాల వద్ద రిక్తం చేద్దామని.

నువ్వలాగే నన్ను చూస్తూ నింపాదిగా కూర్చున్నావు.

శతకోటి సూర్యప్రభలతో
ప్రపంచాన్ని శాసించే నా స్వామి
నా పాట కోసం నా ముందు
ఇంత నిరాడంబరంగా కూర్చుంటే-
ఏ రాగంలో నైవేద్యమవ్వాలో తెలీని భావంతో
ఏ హారతిగా ఆవిరవ్వాలో తెలీని ప్రాణంతో
తడిసిన కన్నుల తడబడు పెదవుల
తడారిన గొంతు దగ్గర
ఆగిపోయి అవ్యక్తమైన నా పాట-

బాధ్యత గుర్తొచ్చి
బొంగురైన గొంతు పెగల్చుకునే సమయానికి-

దివ్వున లేచి నీ సింహాసనం నుంచి వెళ్ళిపోయావు.

కళ్ళనిండా నీళ్ళు నింపుకున్నాను
గొంతు దగ్గర చిక్కుకున్న పాట
వేదనతో వెక్కిళ్ళయింది
నా రాత ఏమని చెప్పను?
నా జ్యోతిని స్తుతించే పాటి సేవ కూడా చేయలేని అభాగ్యానికి
అరచేతుల్తో ముఖం కప్పుకుని
హృదయం విరిగి విలపిస్తుంటే
నీ అమృత హస్తంతో నా భుజం తడిమి
"పాట బావుంది" అన్నావు.

ఎంతో పాడాలి పాడాలి అనుకుంటూనే
ఇంకా పాట ప్రారంభించలేదు నేను.