Saturday, July 17, 2010

చెలీ! ఇదేం అల్లరి!?

కుండపోతగా వాన
కాదు తుఫానేమో.
- మనసులో..

పెద్ద వర్షం వచ్చి వెలిసినట్లుంటుందేం నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే?
వర్షం ఆగిపోయాక కూడా వేసే అందమైన మట్టి వాసనలా
నీ మాటలు ఇంకా నా వెన్నంటే ఉంటాయెం?

చినుకు చినుకుకీ చప్పట్లు కొట్టే పిల్లవాడిలా,
మాట్లాడే నీ కనురెప్పల ప్రతి కదలికకీ ఆహా! అనుకుంటాను.

ఒంటరి వేసవిలో తొలిసారి వర్షం పడితే
బీడు గుండెల్లోకి నిండుగా పీల్చుకున్న తడి
మొదటి వర్షం తొలి చినుకుకి
తడిసిన మనసు కురిపించే మధురమైన ఊహల మట్టి వాసనా

మురళికి జలుబు చేస్తే 'సా'  కి 'గా' పలుకుతుందా! అనే సందేహం
మనో ద్వారం కమాను స్పర్శకి నరం నరం 'కమాన్' అని కంపిస్తే
మనసు స గ మ ద ని - అని హిందోళం అవుతుందా!

ఎక్కడ్నుంచో దూకిపడే జలపాతం
వెచ్చని సాయంత్రం, చలేసే మధ్యాహ్నం
ఎప్పుడూ వినిపిస్తుండే గుర్తుపట్టలేని ఊహాగీతం
గుండెని తీసి మంచులో పెడ్తే కలిగే జిల్లుమనే భావం
ఆ మంచుపూల జల్లులో తడిసిన మనసుకేసే గడ్డకట్టేంత చలీ-

చెలీ! ఇదేం అల్లరి!?

(20/03/2006)

No comments:

Post a Comment