Sunday, April 22, 2012

సీత లాలి

జో అచ్యుతానంద జో జో రా
జో జో - జోజో జోజో
రావే పరమానంద నా గోవిందా
జో జో - స్వామీ బజ్జో

నీలాకాశాన్నే పందిరి చేసి
ఈ చుక్కలతోనే పక్కను వేసి
వీచే గాలి వింజామర చేసి
పూచే పూల పూసెజ్జేసి

నిన్ను- ఆ మిన్ను-లోనున్న- ఆ చిన్నజాబిలి చేసి-

హిందోళ రాగంలో మనసాడగా
ఈ వేళ నీ లాలి నే పాడనా
జోజో జోజో జోజో
జోజో జోజో జోజో


చరణం 1
ఆకేసి పప్పేసి - బువ్వేసి నెయ్యేసి
అత్తవారింటికి నిను పంపేయను
వలపేసి వక్కేసి - పరుపేసి పక్కేసి
నా పక్కనే దాచుకుంటాను

రేయి తెలవారని ఝాములో
హాయి నా లాలితో
మంచి కథ కంచి చేరేంతలో
దాచి నా కొంగులో

ఒళ్ళో- కౌగిళ్ళో -చన్నుల్లో- కన్నుల్లో పాపను చేసి-

నా గాలి పాటల్ని ఈ లాలిగా
రాగాలు తీసేటి ఇల్లాలిగా
జోజో జోజో జోజో
జోజో జోజో జోజో


చరణం 2
ఆ నిండు జాబిల్లి వలవేసి తేలేను
మారాముల మా రాముకి గారాబంగా
ఈ బొండు మల్లెల్ని వలపేసి అల్లేను
చండుని చందురుడనుకో బంగారంగా

వాలు జడ ఉంది నీ ఆటకే
ఇచ్చా నీ చేతికి
అల్లరి చాలించి ఈ పూటకి
బజ్జోరా నా తండ్రివి

మైకం కమ్మంగా - చల్లని కలలే కమ్మంగా-కంటుండాలని

నీ చిట్టితల్లే నీ తల్లిగా
జోకొట్టుతుంటే మెలమెల్లగా

జోజో జోజో జోజో
జోజో స్వామీ బజ్జో


----------------------------------------------
'చుక్కలాంటి అమ్మాయి - చక్కనైన అబ్బాయి' లో ప్రసన్న పాడే పాట.

original గా పల్లవిలో "నీలాంబరాన్నే పందిరి చేసి- నీలాంబరి లోనే పాటను వ్రాసి" అని రాశాను. నీలాంబరి లాలి రాగం. కాని ఈ పాట రాగం హిందోళానికి దగ్గరగా ఉందనిపించి దానిని మార్చాను. పల్లవి, మొదటి చరణాలు రాసింది 2000 రోజుల్లో.

20-ఏప్రిల్-2012

No comments:

Post a Comment